ఉల్లిపాయ శివుడు | Onion and God Story
ఉల్లిపాయ శివుడు
ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానము చేసి శివాలయంకు వెళ్ళి శివున్ని దర్శించుకుందాం అని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తరువాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళాదుంపపై పడినది. బంగాళాదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరచి ఏడుస్తూ సోమసిల్లి పడిపోయింది. కొంత సేపటి తర్వాత శివుడు ప్రత్యేక్షమై “ఓ ఉల్లిపాయ! లేవు నీ బాధకు కారణం ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు” అని శివుడు అడిగాడు.
“పరమ శివా నీకు ప్రణామములు” అని నమస్కరించింది. “నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళాదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కాని నేను చనిపోయినప్పుడు నాకొరకు ఏడ్చేవారు, కన్నీరు కర్చేవారు లేరు స్వామి”. తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమ శివుడు “ఓ! బిడ్డా నీవు బాధ పడకు ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కరణమైతారో వారే నీ కొరకు కన్నీరు కరుస్తారు, ఏడుస్తారు. ఇదే నీకు నేను ఇస్తున్న వారం. ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ.