పిసినారి పుల్లయ్య | Pisinari Pullaya | Miser Story
పిసినారి పుల్లయ్య
ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలంనాటి పాతగుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఏండి, వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది. ఐనా పుల్లయ్య ఆ గుడిసెను బాగుచేయించలేదు, ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది అని భయం. కొద్ది రోజులకు వానా కాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది. పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు. పొరిగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు. పుల్లయ్యతో “ఎందుకు ఇంత బాధ పడుతున్నావు , గుడిసెను బాగుచేయించుకోవచ్చు కదా” అన్నాడు మల్లయ్య. “మల్లయ్య! నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది, ఎండాకాలంలో గుడిసెను బాగుచేయిస్తాను” అన్నాడు పుల్లయ్య. మల్లయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు. వానాకాలం పోయింది. కొన్ని రోజుల్లో ఎండా కాలం రానే వచ్చింది. ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందునుండి వెళుతుండగా వానా కాలంలో జరిగిన విషయం గుర్తుకువచ్చి “పుల్లయ్య! గుడిసెను ఎప్పుడు బాగుచేపిస్తున్నావు, ఎండా కాలం వచ్చింది కదా!” అన్నాడు. “మల్లయ్య! ఎండా కాలం ఇల్లు ఎలా ఉన్నాఒకటే నాకు, ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను, రాత్రికి వాకిట్లో పాడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు” అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి, వానాకాలం వానలు, ఎండాకాలం అవసరం లేదు అంటావు, నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య. మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది. ఈ సారి గాలితోకూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది. పుల్లయ్య గుడిసె కింద పడి చనిపోయాడు. పాపం పుల్లయ్య తిని తినక, కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది. అందుకే పెద్దలంటారు లోభికి అత్యాశ ఎక్కువ.