మంచి యువరాజు | Good Prince |
అనగనగా దరిక అనే రాజ్యానికి చంద్రసేనుడు మహారాజు గా ఉండేవారు. ఆ రాజ్యానికి కౌసల్యాదేవి మహారాణి. వీరికి ఇద్దరు సంతానం, యువరాజు కార్తికేయుడు మరియు యువరాణి మహానిక.
ఒకరోజు రాజుగారు తన కుమారుడైన కార్తికేయుడు తో కలిసి వేటకు బయలు దేరాడు. అడవిలో ప్రయాణిస్తుండగా నది దగ్గర్లో ఉన్న గుడిసె పక్కన ముసలి వాడిని దీనంగా కూర్చోవడం గమనించాడు. అది చూసిన యువరాజు అతని దగ్గరికి వెళ్లి“మీరు వయసులో పెద్దవారు గా కనిపిస్తున్నారు, మీరు ఎవరు ఇలా ఎందుకు దీనంగా కూర్చున్నారు” అని అడిగాడు.
యువరాజు వారిని గమనించిన ఆ ముసలి వ్యక్తి ” నా పేరు రామయ్య నేను రోజు అడవిలో చెట్లు కొట్టి వారం వారం పట్టణంలో కట్టెలు అమ్మి ఇల్లు నడిపించాను ఈరోజు కట్టెలు కొడుతుండగా దాహం వేసి నదీ తీరానికి మంచినీళ్ళు తాగడానికి వచ్చాను ఇంతలో నా కట్టెలమోపును ఎవరో ఎత్తుకెళ్లారు దీంతో ఈ వారం ఆదాయాన్ని కోల్పోయాను. అయితే ఈ వారం ఇల్లు ఎలా నడపాలో తెలువక ఖాళీ చేతులతో కూర్చున్నాను”
అప్పుడు ఆ ముసలి వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న యువరాజు ఇలా అన్నాడు ”దిగులు చెందకు నేను దరిక రాజ్యానికి యువరాజును నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉండటం నేను చూడలేదు మీరు మాతోని రండి మీకు రాజ్యంలో వ్యవసాయం చేసుకోవడానికి స్థలం ఇస్తాము ఇక మీరు వ్యవసాయం చేసుకుంటూ మీ కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు”
యువరాజు గారి మాటలు విన్న రామయ్యా ఎంతో సంతోషించాడు. తన కుమారుని చూసి భవిష్యత్తులో ప్రజలందరిని సంతోషంగా చూసుకుంటాడని రాజుగారి గుండె ఎంతో గర్వం తో నిండి పోయింది. అప్పుడు రాజు వెంబడి ఉన్న సైనికులు యువరాజు గారి కి జేజేలు పలికారు.
అన్నట్టుగానే యువరాజు గారు రాజ్యానికి తిరిగి వెళ్ళిన వెంటనే రామయ్యకి పొలం ఇచ్చారు. దీంతో రామయ్య కుటుంబం మొత్తం రాజ్యంలో సంతోషంగా ఉండసాగారు.
ఈ కథలోని నీతి
కష్టాల్లో ఉన్న వారికి బాధ తీర్చడం రాజు యొక్క మొదటి లక్షణం.