మంచి స్నేహితులు | Good Friends Story In Telugu
మంచి స్నేహితులు
పొట్ట ముత్తయ్య, పొడువు కనకయ్య మంచి స్నేహితులు. చిన్న చిన్న పనులవలన కుటుంబ పోషణ కష్టం అవుతుంది. కావున ఏదైనా స్థిరమైన ఆదాయం వచ్చేటట్టు మార్గము చూపమని ఊరి పెద్ద ఈశ్వరయ్య దగ్గరకు వెళ్ళారు ఇద్దరు. మీరు ఇద్దరు మంచి స్నేహితులు కదా! ఏదైనా వ్యాపారం చేసుకోండీ. కావాలంటే పెట్టుబడికి డబ్బు అప్పుగా ఇస్తాను అన్నాడు ఈశ్వరయ్య.
సరే అంటూ ఈశ్వరయ్య దగ్గర అప్పుచేసి కిరాణ దుకాణం పెట్టారు. గల్లాపెట్ట దగ్గర ముత్తయ్య కూర్చుంటే, కొనడానికి వచ్చేవారికి సరుకులు ఇచ్చే బాద్యత కనకయ్యదిగా ఒప్పుకున్నారు. కొన్నిరోజులలోనే ఈశ్వరయ్య అప్పు తీర్చేశారు. తక్కువ సమయంలో వారి వ్యాపారం బాగా అబివృద్ది చెందడంతో ఎదురుగా ఉన్న దుకాణదారుడు చంద్రయ్యకు అసూయ కలిగింది. ఎలాగైనా స్నేహితుల మద్య గొడవ పెట్టి వ్యాపారాన్ని దెబ్బ తీయాలనుకున్నాడు.
ఒక రోజు ముత్తయ్య దుకాణంలో లేని సమయం చూసి కనకయ్యతో “ నువ్వు రోజంతా నిలబడి పొట్లాలు కట్టివ్వాలి, ముత్తయ్య మాత్రం చక్కగా కూర్చొని డబ్బులు వసూలు చేస్తాడు అంటూ కల్పించి చెప్పాడు చంద్రయ్య. మరునాటి నుండి కనకయ్య, ముత్తయ్యతో పోట్లాడి గల్లాపెట్ట వద్ద కూర్చున్నాడు. పాపం ముత్తయ్యకు అల్మారాలో (సెల్ఫ్) సరుకు అందక కింద పడుతున్నాయి, డబ్బులు తీసుకొని చిల్లర ఇవ్వడానికి గాబరా పడి లెక్కలో తప్పులు జరిగాయ. దీంతో వారి దుకాణానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కొన్ని రోజులకు దుకాణం మూతపడే పరిస్తితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఈశ్వరయ్య ఆ ఇద్దరి స్నేహితులను పిలిపించాడు. మీలో భేదాలు రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. కనకయ్యతో, చంద్రయ్య చెప్పిన మాటలు చెప్పాడు. “అసూయతో చంద్రయ్య చెప్పిన మాటలు విని మీ వ్యాపారాన్ని చెడగొట్టుకున్నారు. అలా కాకుండా ఎప్పటిలాగే ఎవరి పని వాళ్ళు నిజాయితీగా చేసుకొండి. ఇతరుల మాటలని వినకండి అని బెదిరించి పంపాడు ఈశ్వరయ్య. స్నేహితులు ఇద్దరు తమ తప్పును తెలుసుకొని ఎప్పటిలాగే ఎవరి పని వారు చేసుకుంటున్నారు. దుకాణం మంచి లాబాలతో నడుస్తుంది.