What is Sankranti Festival in Telugu
సంక్రాంతి పండుగ:
మన తెలుగువారి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒక పెద్ద పండగ దీనిని మూడు రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ.ఈ పండుగలను జనవరి నెలలో ని 13, 14, 15 లేదా 14, 15, 16 తేదీలలో జరుపుకుంటాము.
- మొదటి రోజు భోగి
- రెండవ రోజు మకర సంక్రాంతి
- మూడవ రోజు కనుమ
భోగి పండుగ యొక్క అర్థం ఏమిటి:
భోగభాగ్యాలను అందించేది భోగి పండుగ అంటాము ఆరోజు ఆవుపేడతో గొబ్బెమ్మలను చేసి వాకిళ్లలో పెడతారు.
తెల్లవారకముందే అందరూ లేచి భోగి మంటలను పెడతారు ఈ భోగి మంటల్లో ఇంట్లోని పాత వస్తువులు అంటే బట్టలు, చెక్క సామాను, పాత చీపుర్లు తట్టలు మొదలైన పాత సామాన్లు మంటలు వేస్తారు.
కొత్త వస్తువుల తో సంతోషంగా పండుగ జరుపుకుంటారు ఇంట్లో అందరూ ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. ఆడపిల్లలు వాకిళ్ళలో రంగు రంగుల ముగ్గులు వేస్తారు.
ఆరోజు చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు, భోగిపళ్ళు అంటే రేగుపళ్లు, పూల రెక్కలు, చెరుకు ముక్కలు, నాణెములు, శనగలు, బియ్యము మొదలగునవి అన్ని కలుపుతారు.
పిల్లలకు కొత్త బట్టలు తొడిగి పీటపై కూర్చోబెట్టి బొట్టు పెడతారు, చుట్టుపక్కల వారిని పేరంటానికి పిలుస్తారు. ముందు పెద్దవారు ఒకరు ఒకరు భోగి పళ్ళ ని రెండు చేతులతో తీసుకుని అటు ఇటు తిప్పుతూ పిల్లల తలపై నుంచి కిందికి విడుస్తారు.
ఇది పిల్లలకు దిష్టి తీసినట్టు భావిస్తారు బొమ్మల కొలువు పెట్టుకుంటారు ఇల్లంతా సందడిగా మారుతుంది. వచ్చిన వారికి తాంబూలము పిండి వంటలు పండ్లు ఇచ్చి పంపిస్తారు. ఈ విధంగా భోగి పండుగ జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ ఇలా జరుపుకుంటారు:
భోగి పండగ తర్వాత రెండో రోజు జరుపుకునే పండగ సంక్రాంతి. దీనినే మకర సంక్రాంతి అని కూడా అంటారు.
ఈ రోజు సూర్యుడు దక్షిణాయనము నుండి ఉత్తరాయణం లోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఇది తెలుగువారి పెద్ద పండగ, ఈ పండుగ నాటికి పంటలు ఇంటికి వస్తాయి, వ్యవసాయం పని తక్కువగా ఉంటుంది, డబ్బులు చేతికి వస్తాయి.
సంక్రాంతి రోజు ఆడపిల్లలు వాకిళ్ళలో కళ్ళాపి చల్లి రంగు రంగుల ముగ్గులు వేస్తారు. గాలిపటాలు, చెరుకు గడలు, గంగిరెద్దులు రకరకాలుగా వేస్తారు. ముంగిళ్లలో గొబ్బెమ్మలను పెట్టి నవధాన్యాలను పోస్తారు. ఈ గొబ్బెమ్మల నే గోదా దేవి గా భావిస్తారు.
ఈరోజు ముఖ్యంగా ఇంటి ముందర పాలు పొంగిస్తారు, కొత్త బియ్యము, బెల్లము, పాలు, చిన్న కుండలో పోసి పిడకల మంట పై పెడతారు.
పాలు పొంగుతుంటే చూసి ఆనందిస్తారు ఈ పండుగ రోజు కోళ్ల పందాలు ఆడుతారు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ కేరింతలు పెడతారు.
గంగిరెద్దులు హరిదాసు కీర్తనలతో వాడవాడలా సందడిగా మారుతాయి మహిళలకు ముగ్గుల పోటీలు పెడతారు సంక్రాంతికి రకరకాల పిండివంటలు చేస్తారు ప్రత్యేకంగా అరిసెలు సకినాలు నువ్వుల లడ్డూలు చేసుకుంటారు.
అయ్యప్ప భక్తులు చేసే దీక్ష ఈరోజు కనిపించే మకర జ్యోతి తో పూర్తి అవుతుంది. ఈ పండుగను అందరూ కలిసి సంతోషంగా చేసుకుంటారు.