Diwali Festival Story In Telugu
దీపావళి |Deepavali
ప్రతి యేట ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకునే పండగే దీపావళి పండగ. దీపావళి అంటే దీపాల వరుస. ఈ ఏడాది అక్టోబరు 24వ తేదీన దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండగను దివాళి అని కూడా పిలుస్తారు. హిందువుల ముక్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దీపావళి పండగ అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది దీపాలు, మిఠాయిలు, టపాసులు. దసరా పండుగ జరిగిన 20 రోజులకి దీపావళి పండుగ జరుపుకుంటారు.
చీకటిని తొలగించి ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ దీపావళి. దీపం సౌశీల్యానికి, సౌభాగ్యానికి, సౌజన్యానికి ప్రతీకలు. మట్టి ప్రమిదలు, లక్ష్మి దేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. పరిసరాలంతా దీప కాంతులతో విరాజిల్లుతుంది.
దీపావళి పండుగ చరిత్ర
హిందూ పురాణాల్లో దీపావళి పండగ గురించి రకరకలుగా వర్ణించారు. ఈ పండుగకు రెండు కథలు ఉన్నాయి అని పురాణాలు చెప్తున్నాయి. అందులో మొదటి కథ పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండే వాడు. దేవతలను, ప్రజలను చాలా హింసించేవాడు ఆ బాధలు భరించలేక శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకుంటారు. నరకాసురిడికి ఎవరి చేతిలోను చావు లేకుండా, కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే చనిపోయే వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. చివరికి సత్యభామ దేవి చేతిలో నరకాసురుడు మరణిస్తాడు. చతుర్దశి నాడు నరకుడు మరణించడం వలన నరక చతుర్దశిని జరుపుకుంటారు.
రామాయణంలోను దీపావళికి ఒక కథ ఉంది. లంకలో రావణాసురుని రాముడు సంహరించి అయోధ్యకు సీతతో కలిసి తిరిగి వస్తాడు. రాముడిని స్వాగతించడానికి మరియు అతని విజయాన్ని జరుపుకోడానికి దీపాలు వెలిగిస్తారు. ఆరోజు నుండి చెడుపై మంచి విజయాన్ని ప్రకటించడానికి ఈ పండగను జరుపుకుంటారు.
లక్ష్మీదేవి పూజ
పూర్వం దుర్వాసుడు అనే మహర్షి ఇంద్రుడి అతిధ్యానికి మెచ్చి ఒక హారాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ హారాన్ని ఇంద్రుడు స్వీకరించకుండా ఐరావతం మెడలో వేస్తాడు. ఐరావతం ఆ హారాన్ని కాలితో తొక్కి వేస్తుంది. అది చూసిన ఋషి కోపంతో ఇంద్రుడి సంపదలు అన్నీ పోతాయి అని శపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు శ్రీ మహా విష్ణువు దగ్గరికి వెళ్తే మహా విష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని చెప్తాడు. ఇంద్రుడు దీపాన్ని వెలిగించగనే లక్ష్మీదేవి ప్రత్యేక్షమై ఇంద్రుడు కోలిపోయిన సంపదను తిరిగి ప్రసాదిస్తుంది. అందువలన దీపావళి రోజు ప్రతి ఇంట్లో సాయంత్రం లక్ష్మీ పూజలు చేస్తారు. ఇంటిని శుభ్రం చేసుకొని పూలతో, దీపాలతో అలంకరిస్తారు.
దీపావళి రోజు ఇంట్లో అందరూ రకరకాల పిండి వంటలు, మిఠాయిలు తయారు చేసుకుంటారు. దీపాలతో పాటు బాణాసంచాలు కూడా కాలుస్తారు. పిల్లలు పెద్దలు ఎంతో సంతోషంగా బాణాసంచాలు కాలుస్తూ ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచం మొత్తం ప్రకాశవంతం కావడంతో దీపావళి కాంతి పండగ అని కూడా పిలుస్తారు.