పాము ముంగీస | Story of Snake and Mongoose
ఒక ఊరిలో భాస్కర శర్మ, కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ధాన, ధర్మాలు చేసేవారు. వారు ఎంతో దయగలవారు. వారికి కొంత కాళం వరకు పిల్లలు కలగలేదు. పిల్లల కొరకు ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసేవారు. వారి పూజలు ఫలించి పండంటి బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డని ఎంతో ప్రేమగా, అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఒకరోజు భాస్కర శర్మ పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగిస కనిపించింది. దానిని చూసి అక్కడ నిలబడ్డాడు బ్రాహ్మణుడు. ముంగిస అతని దగ్గరకు వచ్చింది. ముంగీసను పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది. “దీనిని మనం పెంచుకుందాం” అని చెప్పాడు. “అవును, అవును మన బిడ్డకు కాపలాగా కూడా వుంటుంది” , అనుకున్నారు. ఆ రోజు నుండి బిడ్డతోపాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. ఒకరోజు భాస్కర శర్మ “పూజలు చేయడానికి బయటకి వెళ్తాను బిడ్డ జాగ్రత” అని చెప్పి వెళ్ళాడు. కమలమ్మ కొంత సేపటి తర్వాత ఇంటి పని, వంట పని చేసింది. ముంగీసకు ఆహారం పెట్టింది. బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోపెట్టింది. మంచి నీళ్ళు తేవడానికి బావి వద్ద వెళ్తున్నాను, నేను వచ్చే వరకు బిడ్డని జాగ్రతగా చూసుకోమని ముంగిసతో చెప్పి బిందె పట్టుకొని బయలు దేరింది కమలమ్మ. సరే అనట్టు తల ఊపింది ముంగీస. ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కస్తూ ఉంది ముంగీస. కొద్ది సేపటి తర్వాత నల్లత్రాచు పాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారి ఎగిరి పాముని పట్టుకొని కొరికి చంపింది. ముంగీస మూతికి ఆ రక్తం ఉంది. బిడ్డని కాపాడిన సంతోశంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది. అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీస మూతికి, వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి నా బిడ్డని చంపేసింది అని బోరున విలపించింది. నమ్మినందుకు ఇంత పని చేసిందంటు ఆవేశంలో నీటి బిందెను ముంగీస పై విసిరింది. ఆ దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకొని చనిపోయింది. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరింతలు పెడ్తున్నాడు. పక్కనే కింద పెద్ద నల్లత్రాచు పాము చచ్చిపడింది. అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరున విలపించారు.