శ్రావణ మాస విశిష్టత | Sravana Masam

శ్రావణ మాస విశిష్టత | Sravana Masam
Spread the love

Sravana Masam Start Date: Saturday (శనివారం), July 23

Sravana Masam End Date: Monday(సోమవారం), August 22

శ్రావణ మాస విశిష్టత

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి.

ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము.

ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది.

మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

శ్రావణ సోమవారం

ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు

శ్రావణ మంగళవారం

శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు.

కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.

శ్రావణ శుక్రవారం

ఈ మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము.

శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది.

మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.

ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం

శ్రావణ శనివారాలు

ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పౌర్ణమి

శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .

జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు
రక్షా బంధనం

శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది.

శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతికరమైన రోజు కావున ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఇది ఎప్పటి నుండో వస్తున్న శాస్త్ర విజ్ఞాన సంప్రదాయమేనని తెలుస్తోంది.

Sudha

Sudha is a homemaker. Her knowledge in Telugu literature and passion for writing has influenced her to start this blog with the help of her son. She uses to tell a story at the night to her son daily. Now her idea is to share all the stories in this blog for children.

One thought on “శ్రావణ మాస విశిష్టత | Sravana Masam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2020 - Telugu Stories